ఇండియాకు వచ్చేస్తా.. తక్కువ జీతమైనా సరే.. అమెరికా టెక్కీ ఆవేదన

  • తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్యంతో అమెరికా ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐ
  • ఏఐ ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన
  • ఇండియాకు వచ్చి తక్కువ జీతంతోనైనా పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి
  • మానసిక ఆరోగ్యమే ముఖ్యమంటూ నెటిజన్ల మద్దతు.. పలువురి సలహాలు
అమెరికాలో అధిక జీతంతో కూడిన ఉద్యోగం ఎంతోమంది కల. కానీ, ఆ కల వెనుక ఉండే ఒత్తిడి, ఆందోళన జీవితాన్నే నరకంగా మార్చేస్తాయని ఓ ఎన్ఆర్ఐ టెక్కీ అనుభవం చెబుతోంది. గత 8 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అక్కడి ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఇండియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక నెటిజన్ల సలహా కోరారు.

సుమారు 7 ఏళ్ల అనుభవం ఉన్న ఈ టెక్కీ తన పోస్టులో పలు కీలక విషయాలు వెల్లడించారు. "ప్రారంభంలో అంతా బాగానే ఉన్నా, గత ఏడాది నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాక్సిక్ మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై పనిచేయాలనే తీవ్రమైన ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలు నన్ను కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది" అని ఆయన పేర్కొన్నారు. జీవితంలో తనకు సరైన సపోర్ట్ సిస్టమ్ లేదని, ఒంటరిగా ఈ ఒత్తిడిని ఇక భరించలేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఒత్తిడి తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన తెలిపారు. "గత ఏడాది నుంచి హై బీపీ, డిప్రెషన్ కోసం మందులు వాడుతున్నాను. ప్రతి ఉదయం నిద్రలేవగానే స్ట్రోక్ వస్తుందేమోనన్న భయం వేస్తోంది. రోజురోజుకీ టెక్నాలజీ రంగంపైనే విరక్తి కలుగుతోంది" అని తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో ఇండియాకు తిరిగి వచ్చి, తక్కువ జీతం అయినా సరే ప్రశాంతమైన జీవితాన్నిచ్చే ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. "భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాలు పంచుకోండి" అని ఆయన కోరారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. "కుటుంబానికి, స్నేహితులకు దగ్గరగా ఉండటం కోసం తిరిగి రావడం మంచి నిర్ణయమే. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు" అని ఒకరు కామెంట్ చేశారు. "జీతం తక్కువైనా ఒత్తిడి లేని ఉద్యోగంలో చేరండి. ఇప్పటివరకు మీరు చాలా కష్టపడ్డారు. ఇక మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి" అని మరో యూజర్ సలహా ఇచ్చారు. "మీ మానసిక ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు" అంటూ చాలామంది ఆయనకు ధైర్యం చెప్పారు.

NRI Techie
America job stress
Software Engineer
High BP
Depression
Return to India
IT jobs India
Work life balance
Mental health
Artificial Intelligence

More Telugu News